మహిళల ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేస్తాడు.. చివరికి?

గురువారం, 24 జూన్ 2021 (11:50 IST)
మహిళల చిత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్‌ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే.. సంజీవరెడ్డినగర్‌కు చెందిన మహిళకు ఆదివారం రాత్రి ఇన్‌స్టాలో గుర్తుతెలియని ఓ ఖాతా నుంచి సందేశం వచ్చింది. క్రేజీ ఛాట్‌ చేయాలని ఉందని అందులో ఉంది. ఆమె తిరస్కరించి ఆ ఖాతాను బ్లాక్‌ చేశారు. 
 
మరో ఖాతా నుంచి ఆమెకు సంబంధించిన మార్ఫింగ్‌ చిత్రాలతో పాటు ఓ సినీ నటి చిత్రాన్ని పంపించాడు. మీ కుమార్తె చిత్రాన్ని ఈ నటి చిత్రానికి ఎడిట్‌ చేసి పంపించాలనుందన్నారు. దీంతో ఆమె ఈ ఖాతాను బ్లాక్‌ చేశారు. మరో ఖాతా నుంచి ఆమె కుమార్తె చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి పంపించాడు. నన్ను తిరస్కరిస్తే మీ అమ్మాయి చిత్రాలను వైరల్‌ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు హైదరాబాద్‌ సైబర్‌ పోలీసులను ఆశ్రయించారు.
 
నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి, గుండూరుకు చెందిన మొగిలి ఆంజనేయులు(21) హైదరాబాద్‌ కొత్తపేటలో నివాసముంటున్నాడు. డిగ్రీ మధ్యలో మానేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి కాపలాదారుడుగా చేస్తున్నాడు. ఛాటింగ్‌లు చేస్తుంటాడు. ఎవరైనా అతన్ని బ్లాక్‌ చేస్తే.. రకరకాల పేర్లతో నకిలీ ఖాతాలు తెరుస్తాడు. బ్లాక్‌ చేసిన ఖాతాలోని డీపీ చిత్రాలను తీసుకొని న్యూడ్‌ చిత్రాలకు బాధితుల ముఖాలను తగిలించి నకిలీ ఖాతాల ద్వారా బాధితులకే పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
 
నగ్నంగా తనకు దర్శనమివ్వాలని, లేదంటే మీ న్యూడ్‌ చిత్రాలను ఇతరులకు పంపిస్తా.. వైరల్‌ చేస్తానంటూ బెదిరిస్తున్నాడు. కొందరు బెదిరింపులకు లొంగిపోయి అంగీకరించారు. ఎవరైతే అతను చెప్పింది చేశారో.. వారిని తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానని హెచ్చరించాడు. 15 మంది చిత్రాలను మార్ఫింగ్‌ చేశాడని సమాచారమన్నారు. సరదా కోసమే ఇలా చేశానని నిందితుడు చెప్పడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు