ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కారుకూతలు కూస్తున్నారు : నాగబాబు

బుధవారం, 9 ఆగస్టు 2023 (17:12 IST)
మెగాస్టార్ చిరంజీవి ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు కారుకూతలు కూస్తున్నారంటూ మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యానించారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు.. అభివృద్ధి అనే పదానికి అర్థమే తెలియదు అంటూ ఏకిపడేశారు. 
 
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం ద్విశత దినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ఇతర విషయాలను ఆలోచించకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా సినీ పరిశ్రమ పై పడతారేంటి అని ఏపీ ప్రభుత్వానికి చురకలు అంటించారు. ఇవి తీవ్ర దుమారం రేపాయి. 
 
మంత్రులు, వైకాపా నాయకులు విలేకరుల సమావేశం పెట్టి, మరీ చిరు వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేశారు. అయితే, వైకాపా నాయకుల వ్యాఖ్యలకు అటు చిరు, ఇటు పవన్ స్పందించలేదు. తాజాగా వారి సోదరుడు, నటుడు, జనసేన నాయకుడు నాగబాబు స్పందించారు. ట్విటర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
 
'శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అణా పైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్‌లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్రపరిశ్రమ.. అయితే నిజం మాట్లాడిన వ్యక్తి మీద విషం కక్కుతున్నారు ఆంధ్రా మంత్రులు. ఆయన ఫొటో కోసం పడిగాపులు కాసినోళ్లు కూడా ఆయన మీద కారు కూతలు కూస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీదే పడుతుంది. 
 
మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు. అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదు. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగలలేదనుకుంటున్నారు..! మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుంది. మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ముగింపు త్వరలోనే ఉంది అంటూ వ్యాఖ్యానించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు