నిమ్మగడ్డకు పిచ్చి పీక్ స్టేజ్‌కి చేరింది: వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్

బుధవారం, 18 నవంబరు 2020 (15:43 IST)
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని వైకాపా ఎమ్మెల్యే జోగి రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డకు పిచ్చి పీక్ స్టేజీకి చేరిందన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే నిమ్మగడ్డ జేబు సంస్థ కాదనీ, ఈ సంస్థను వాళ్ళబాబు ఏర్పాటు చేయలేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. 
 
ఏపీలో పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీన్ని వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు తీవ్రంగా తప్పుబడుతారు. పైగా, నిమ్మగడ్డను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఇందులోభాగంగా, జోగి రమేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. అలాంటి సంస్థకు అధిపతిగా ఉన్నప్పుడు కొన్ని నియమ నిబంధనలు పాటించాలన్నారు. కరోనా ప్రారంభంలో రాష్ట్రంలో ఏడు యాక్టివ్ కేసులు ఉన్నప్పుడు ఎవరిని సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేసిన నిమ్మగడ్డకు... ఇప్పుడు రోజుకి 7 వందల కేసులు వస్తున్నాయి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 
 
రాష్ట్రంలో 16 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి... 6 వేల మందికి పైగా చనిపోయారు... సెకండ్ వేవ్ వస్తుందని ఇతర దేశాలు సైతం అప్రమత్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆయన సమాయత్తమవడం చూస్తుంటే.. రమేష్ కుమార్‌కు పిచ్చి పీక్ స్టేజ్‌కు చేరిందని మండిపడ్డారు. 
 
పైగా, ఎస్ఈసీ మీ జేబులో సంస్థ అనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ బద్ధ సంస్థ అని జోగి రమేష్‌ ధ్వజమెత్తారు. ఎన్నికల విషయంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను సంప్రదించాల్సిన అవసరం ఉందని, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందన్నారు. మీరు చెప్పినట్టు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్, డీజీపీ, సన్నద్ధంగా ఉండరని, ప్రజలతో పాటు ఉద్యోగ సంఘాలు కూడా తాము ఎన్నికలకు సన్నద్ధంగా లేమని చెబుతున్నారని గుర్తుచేశారు. 
 
ఇక్కడ ఉంది ప్రజాస్వామ్య ప్రభుత్వమన్నది గమనించాలన్నారు. చంద్రబాబుకు, టీడీపీకి తొత్తులాగా నిమ్మగడ్డ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కుల పిచ్చి పట్టిన అహంకార వాదిలా నిమ్మగడ్డ ప్రయత్నాలు ఉన్నాయని, ఎన్నికల కమిషనర్‌ అన్న విషయాన్ని నిమ్మగడ్డ గుర్తుపెట్టుకోవాలన్నారు. ఆ స్థానం వదిలేసి.. నిమ్మగడ్డ రమేష్‌లా వ్యవహరించవద్దని ఎమ్మెల్యే జోగి రమేష్ సలహా ఇచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు