ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూ వార్తల్లో నిలిచే సినీనటి, ఎమ్మెల్యే రోజా మరోసారి వార్తలోకెక్కారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబుకు బిపి వచ్చిందంటూ దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేశారు. అమ్మకు నార చీర కొనివ్వని వాడు పిన్నికి పట్టుచీర కొనిపెడతా అన్నట్టుగా చంద్రబాబు తీరు ఉందని ఎద్దేవా చేశారు. సొంత నియోజవర్గం కుప్పంతో తాగేందుకు నీళ్ళు ఇవ్వలేని చంద్రబాబు పులివెందులకు నీళ్లు ఇచ్చానని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
వైఎస్ దాదాపు పూర్తి చేసిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేస్తూ చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన మూడు మోసాలు, ఆరు అబద్దాలతో సాగుతోందన్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల హీట్ చూసి బాబుకు బిపి మరింత పెరిగిపోతోందని, యుపిలో అఖిలేష్ లాగే లోకేష్ కూడా తనకు వెన్నుపోటు పొడుస్తారన్న భయం చంద్రబాబును వెంటాడుతోందన్నారు. అందుకే లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు వెనుకాడుతున్నారని ఆరోపించారు.