రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు అభినందనీయమైనవని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్నచర్యలను మంగళవారం ఆయన విజయవాడలోని రాజ్ భవన్ నుండి వీడియో సమావేశం ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని,వైద్య ఆరోగ్యశాఖ అధికారులతోను గవర్నర్ సమీక్షించారు.
ఈసందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ.. కరోనా నియంత్రణకు ముందుండి పోరాడుతున్న డాక్టర్లు,ఇతర వైద్య సిబ్బంది,పారిశుద్ధ్య సిబ్బంది,స్వచ్ఛంధ సంస్థలు తదితరుల సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు బాగున్నాయని ఇదే కృషిని మరింత కొనసాగించి అధికసంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా పాజిటివ్ వచ్చి రోగులందరికీ మెరుగైన వైద్య సేవలందించి వైరస్ వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
లాక్ డైన్ ఎత్తివేశాక రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య బాగా పెరిగిందని ముఖ్యంగా తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూల్, చిత్తూర్ తదితర ఐదు ఆరు జిల్లాల్లో కేసులు బాగా పెరిగాయని ఆయా జిల్లాల్లో వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరిన్నికట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ఆదేశించారు.
ప్రతి పది లక్షల జనాభాకు ఎక్కువ మందికి పరీక్షలు చేయడంలోను సంజీవని వంటి మొబైల్ టెస్టింగ్ వాహనాల ద్వారా పెద్దఎత్తున పరీక్షలు చేయడంలో దేశంలో మిగతా రాష్ట్రాలకంటే మన రాష్ట్రం ముందంజలో ఉండడం అభినందనీయమని గవర్నర్ పేర్కొన్నారు. అంతేగాక ఆరోగ్యశ్రీని కరోనా రోగులకు వర్తింపచేయడం వల్ల ఆయా రోగులకు మరింత మేలు కలుగుతుందని చెప్పారు.
హోం క్వారంటైన్లో ఉన్నవారిని నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం,భౌతిక దూరాన్ని పాటించడం వంటి అవగాహనా చర్యలు చేపట్టడం ద్వారా కరోనా వ్యాప్తి నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సూచించారు.
విజయవాడ ఆర్అండ్బి కార్యాలయం నుండి ఈవీడియో సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిమాట్లాడుతూ లాక్ డౌన్ ఎత్తివేశాక రాష్ట్రంలో కేసులు అధికమయ్యాయని అందుకనుగుణంగా కోవిడ్ కేర్ కేంద్రాల్లో వైద్య సేవలు మెరుగుపర్చామని గవర్నర్ కు వివరించారు.పెరుగుతున్న కేసులకు అనుగుణంగా పడకల సంఖ్యను అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలిపారు.
కరోనా నియంత్రణకు జిల్లా కలక్టర్లను పూర్తిగా సన్నద్ధం చేయడమేగాక ప్రతి జిల్లాకు ల్యాబ్ లను అందుబాటులోకి తెచ్చామని అన్నారు.ఇప్పటికే గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఐదు విడతల సర్వే నిర్వహించడం కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి వారికి సకాలంలో పరీక్షలు చేసి అవసరమైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టామని వివరించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆసుపత్రుల సన్నద్ధతపై పెద్దఎత్తున చర్యలు తీసుకుని తగిన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చామని వివరించారు.అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహిండంపై ప్రత్యేక దృష్టి సారించడం తోపాటు మరణాల సంఖ్యను కనిష్ట స్థాయికి తెచ్చేందుకు అన్న ప్రయత్నాలు చేస్తున్నట్టు సిఎస్ నీలం సాహ్ని గవర్నర్ కు వివరించారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొదటి కరోనా కేసు మార్చి 9వతేదీన నెల్లూరు జిల్లాలో నమోదయిందని తెలిపారు. లాక్ డౌన్ ఎత్తివేతతో కేసుల సంఖ్య అధికమైందని ప్రస్తుతం రాష్ట్రంలో కేసులు 50వేలు దాటాయని వివరించారు.ప్రతి 10లక్షల జనాభాకు 24వేల మందికి కరోనా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
మరణాల సంఖ్యను శాతాన్ని 1కంటే తక్కువ తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.మరో 3లక్షల 25వేల ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్ కిట్లను ప్రొక్యూర్ చేస్తున్నామని దాంతో 15-20 నిమిషాల్లోనే పరీక్షా ఫలితాలు తెలిచేందుకు వీలుంటుందని వివరించారు.కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంలో భాగంగా కోవిడ్ ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద 2700 డాక్టర్లు,పారామెడికల్ సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.
రాజ్ భవన్ నుండి గవర్నర్ కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా వీడియో సమావేశంలో పాల్గొనగా ఇంకా ఈవీడియో సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ కె.భాస్కర్,ఆసుపత్రి సేవల ప్రత్యేక అధికారి ఎ.రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.