ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలకు వైకాపా ఎంపీ ఛాలెంజ్...

మంగళవారం, 16 జూన్ 2020 (21:47 IST)
ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలకు ఆ పార్టీకి చెందిన నరసాపురం లోక్‌సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు బహిరంగ సవాల్ విసిరారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి బొమ్మ పెట్టుకుని గెలిచాడంటూ తనపై విమర్శలు గుప్పిస్తున్న నేతలంతా.. ఈసారి జగన్ బొమ్మ పెట్టుకుని గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. 
 
అలాగే, తన బొమ్మ పెట్టుకుని గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సింహం సింగిల్ గానే వస్తుందంటూ రజనీకాంత్ డైలాగును ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ ఇంటికి కూడా వెళ్లనని ఎన్నికలకు ముందే తాను చెప్పానని... చెప్పిన విధంగానే ఆయన ఇంటికి వెళ్లడానికి తాను ఇష్టపడకపోతే, ఎయిర్ పోర్టులో తనను కలిశారని ఆయన గుర్తుచేశారు. 
 
మరోవైపు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తనను తిట్టారని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఒక ఇసుక దొంగ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇళ్ల స్థలాలలో కూడా కోట్ల రూపాయలను దోపిడీ చేశారని ఆరోపించారు. ఆయన అరాచకాల గురించి ఆయన మేనల్లుడే చెపుతాడని అన్నారు. 
 
ఎమ్మెల్యే నాగేశ్వరరావుపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు హుందా కలిగిన వ్యక్తి అని కితాబునిచ్చారు. ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌కు జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని... ఈ విషయంలో ఆయన బాధపడ్డారని చెప్పారు. తనను విమర్శించిన వాళ్లు రాజీనామా చేస్తే... తాను కూడా రాజీనామా చేస్తానని, అపుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని రఘురామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు