నీళ్లు అమ్ముకుంటున్న అధికారులు .. ఒక్క పని చేయలేదు : మాజీ మంత్రి ఆనం

బుధవారం, 3 జూన్ 2020 (18:23 IST)
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఒక యేడాది పాలనపై మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, నెల్లూరు జిల్లా ప్రభుత్వాధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదని తప్పుబట్టారు. 
 
ముఖ్యంగా, జలవనరుల శాఖలో అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, ఎస్‌ఎస్‌ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ చెప్పినా అధికారులు వినడంలేదని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. 
 
23 జిల్లాలకు మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారం కాదన్నారు. ప్రజల కోసం ప్రభుత్వాన్ని, అధికారులను నిలదీయడానికి సిద్ధమని ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులకు డీపీఆర్‌లు ఇచ్చామని... అవి ఎక్కడ ఉన్నాయో కూడా తనకు తెలియదని చెప్పారు. 
 
అంతేకాకుండా, గత యేడాది కాలంలో తన నియోజకవర్గానికి ఏ ఒక్క పని చేయలేక పోయినట్టు వాపోయారు. తన నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా నేరుగా అందేవి తప్ప... ఇతర ఏ కార్యక్రమాలనూ తాను చేయలేకపోతున్నానని మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పుకొచ్చారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు