కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులా? ఇది పులిని చూసి నక్క వాతపెట్టుకున్న చందంగా ఉందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. పైగా, మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారు రెఫరెండమ్ నిర్వహించాలని, అప్పటివరకు మూడు రాజధానుల అంశాన్ని వాయిదా వేయాలని ఆయన కోరారు.
మూడు రాజధానుల అంశంతో పాటు సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై గవర్నర్ హరిచందన్ సంతకాలు చేశారు. దీన్ని బ్లాక్‌డేగా అన్ని విపక్ష పార్టీలు అభివర్ణిస్తున్నాయి. ఇదే అంశంపై ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, మూడు రాజధానుల అంశంపై రెఫరెండమ్ నిర్వహించాలని, అప్పటిదాకా దానిపై నిర్ణయాన్ని నెలరోజులపాటు వాయిదా వేయాలని కోరారు.
ఒకవేళ ప్రభుత్వానికి అనుకూలంగా ఆ రెఫరెండమ్ ఫలితాలు ఉంటే రాజధాని రైతులు ఆందోళనలు చేయబోరన్నారు. రాజధాని అమరావతిలో పెద్ద ఇల్లు, పార్టీ కేంద్ర కార్యాలయం కట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశారని, వాటిని చూశాకే ఆయనకు వారు ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయాన్ని అందించారన్నారు.
'ప్రభుత్వం తీసుకొనే ప్రతి నిర్ణయానికీ సీఎం ఆఫీసులో ఉన్న ఒకే ఒక వ్యక్తి కారణం. వైసీపీ క్రమ పతనానికీ ఆయనే కారణం. మంత్రి, సేనాపతి, భట్రాజు అన్నీ ఆ అధికారే. ఆయన్ను పక్కన పెట్టుకుని, ఆయనకు అన్ని అధికారాలు ఇచ్చి సాటి అధికారులను అవమానిస్తున్నారు. నాకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటుకాకుండా ఆ అధికారే అడ్డుకున్నారని తెలిసింది. కొత్త సీఎం వచ్చిన ప్రతిసారీ రాజధానిని మార్చాలనుకోవడం అవివేకమైన చర్య. ఒక సామాజికవర్గం బలపడుతుందేమోనని రాజధానిని తరలించడం సరికాదు' అని వైకాపా అసమ్మతి ఎంపీ వ్యాఖ్యానించారు.