కేంద్ర ప్రభుత్వం 4,445 కోట్ల రూపాయల వ్యయంతో దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఏడు మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ రీజియన్, అప్పరెల్ పార్కు (మిత్రా)లలో ఒక దానిని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్ కడప జిల్లా కొప్పర్తిలో నెలకొల్పవలసిందిగా మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ప్రతిపాదించిన మిత్రా పార్కు ద్వారా స్పిన్నింగ్, డైయింగ్, ప్రింటింగ్ వంటి ప్రక్రియలు ఒకే చోట చేపట్టే వీలు కలుగుతుంది. తద్వారా టెక్స్‌టైల్ వాల్యూ చైన్ యావత్తు ఒకే చోట సమీకృతం అవుతాయి. మిత్రా పార్కులలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. ఫలితంగా రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఈ పార్కుల ద్వారా దేశీయంగా, అంతర్జాతీయంగా టెక్స్‌టైల్ రంగంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించవచ్చని విజయసాయి రెడ్డి అన్నారు.
వైఎస్‌ఆర్ కడప జిల్లా కొప్పర్తి ఇప్పటికే అనేక టెక్స్‌టైల్ ఆధారిత పరిశ్రమలతో అభివృద్ధి పథంలో కొనసాగుతోంది. ఇటీవల ఈ ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ఏర్పాటు చేసింది. కాబట్టి మిత్రా పార్కు అభివృద్ధికి అవసరమైన రోడ్డు, రవాణా వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. గత కొన్నేళ్ళుగా ఈ ప్రాంతం పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలను ప్రకటించి ఈ ప్రాంతాన్ని పెట్టుబడిదారుల అనుకూల ప్రాంతంగా ప్రమోట్ చేస్తోందని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
దేశంలో కాటన్, సిల్క్ అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో నాలుగున్నర లక్షల మంది నిపుణులైన హ్యాండ్‌లూమ్, పవర్‌లూమ్ కార్మికులు ఉన్నారు. అభివృద్ధి చెందిన స్పిన్నింగ్, ప్రాసెసింగ్ రంగం ఉంది. కాబట్టి మిత్రా పార్క్ ఏర్పాటు రాష్ట్రానికి గణనీయమైన మేలు చేస్తుంది. మిత్రా పార్క్ రాష్ట్రం మొత్తానికి ఇది ఏకైక నోడల్ పాయింట్‌గా అభివృద్ధి చెంది సప్లై చైన్ సమీకృతం కావడానికి దోహదం చేస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు.