నా భర్త నాపై దాడి చేస్తున్నాడు కాపాడండీ, దిశ యాప్ కంప్లైంట్, నిమిషాల్లో స్పంద‌న‌

శుక్రవారం, 16 జులై 2021 (17:26 IST)
గుంటూరు రూరల్ పోలీసులు దిశ కంప్ల‌యింట్‌కి నిమిషాల్లోనే స్పందించారు. ఒక మ‌హిళ‌కు స‌హాయం అందించారు. దిశా యాప్ ద్వారా సహాయం కోరిన మహిళ ఫిర్యాదుపై సత్వరమే స్పందించి, నరసరావుపేట 2 టౌన్ సీఐ వెంకట్రావు సంఘ‌ట‌న స్థ‌లంలో త‌క్ష‌ణం వాలిపోయారు.

స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీ నుండి షేక్ రేష్మా అనే మహిళ దిశ కాల్ చేసింది. తన భర్త విపరీతంగా కొడుతున్నాడని, తనను తక్షణమే కాపాడాలని... దిశా యాప్ ద్వారా పోలీసుల సహాయం కోరింది. అంతే, కేవలం 5 నిముషాలలో ఘటనా స్థలానికి చేరుకుని, భర్త చేతిలో గాయపడిన మహిళను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి త‌ర‌లించారు.

షేక్ రేష్మాను ఆసుప‌త్రిలో చేర్పించి గాయాల‌కు చికిత్స చేయించారు. ఆమెకు ధైర్యం చెప్పి, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను సీఐ వెంక‌ట్రావ్ కోరారు. వైద్య ఖర్చుల‌ నిమిత్తం బాధితురాలికి కొంత నగదు కూడా అందించారు.

ప్రతి మహిళ తమ మొబైల్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని, ఆపదలో ఉన్న సమయంలో తమకు సమాచారమిస్తే, వీలైనంత త్వరగా బాధిత మహిళను కాపాడతామని సీఐ వెంకట్రావు వెల్ల‌డించారు. సహాయం అందించిన నరసరావుపేట 2 టౌన్ సీఐ వెంకట్రావు స్పందనకు మెచ్చి గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్నిఆయ‌న్ని అభినందించారు. సీఐ వెంక‌ట్రావ్ తోపాటు ఆయ‌న పోలీస్  సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు