కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులకు డెడ్ లైన్ లేదు.. పెళ్లి ఫోటో అక్కర్లేదు : మంత్రి నాదెండ్ల

ఠాగూర్

శుక్రవారం, 23 మే 2025 (16:58 IST)
కొత్త రేషన్ కార్డుల జారీకి నిర్ణీత గడువు అంటూ ఏదీ లేదని, అలాగే, మ్యారేజ్ సర్టిఫికేట్ లేదా పెళ్లి పత్రిక లేదా వివాహానికి సంబంధించిన ఫోటోలు అక్కర్లేదని ఏపీ రాష్ట్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డు పొందాలంటే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరి అంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. 
 
రేషన్ కార్డుల జారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి సర్టిఫికెట్‌గానీ, పెళ్లి పత్రికగానీ, వివాహానికి సంబంధించిన ఫొటోలుగానీ అవసరం లేదన్నారు.  ఈ విషయంలో క్షేత్రస్థాయిలోని సిబ్బంది ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని ఆదేశించారు. రేషన్ కార్డు కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా తప్పనిసరిగా స్వీకరించాలని, ఏవైనా సందేహాలుంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు.
 
రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి  భరోసా ఇచ్చారు. దరఖాస్తు అందిన 21 రోజుల్లోగా సమస్యను పరిష్కరించి కార్డులు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన 4.24 కోట్ల మందికి జూన్ నెలలో ఉచితంగా రేషన్ కార్డులు (స్మార్ట్ రైన్కార్డులు) జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద సిద్ధంగా ఉందని, పంపిణీ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు