తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మౌర్య రాజు, మౌర్య లక్ష్మీ అనే దంపతులు జీవనోపాధి కోసం గుంటూరుకు వలస వచ్చారు. వీరికి రజనీ అనే ఏడు నెలల చిన్నారి ఉంది. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఇతర చిన్నారులు రజనీని ఆడిస్తున్నారు.
ఈ క్రమంలో నోట్లో నెయిల్ కట్టర్ పెట్టగా, అదేమిటో తెలియని చిన్నారి దానిని మింగేసింది. ఇతర పిల్లలు ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులకు చెప్పగా... వారు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దీనిపై తక్షణం స్పందించిన వైద్యులు.. చిన్నారికి ఎక్స్‌రే, ఇతర వైద్య పరీక్షలు చేసి నెయిల్ కట్టర్ ఆహార వాహికలో నుంచి జారి జీర్ణాశయంలోకి చేరినట్లు గుర్తించారు. అయితే తక్షణమే ప్రమాదమేమీ లేదని పాప తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.