తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నందమూరి తారక రామారావు 25 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఎమ్యెల్యే గద్దె రామమోహన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ సర్కిల్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి నాయకులు అందరూ గజమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం ఎంపి కేశినేని నాని మాట్లాడుతూ అన్ని సామాజిక వర్గాలను ఏకతాటి మీదకి తీసుకువచ్చి, కుల మతాలకు అతీతంగా ఎంతో మంది విద్యావంతులను రాజకీయాలలోకి తీసుకువచ్చిన ఘనత కేవలం ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. రాజకీయాలతో పాటు సినీ రంగంలో కూడా ఎన్టీఆర్ కు సాటి ఎవ్వరూ లేరన్నారు. సినీ రంగంలో ఆయన ఏ పాత్ర ధరించినా దానికి న్యాయం చేసేవారని, ఏ రంగంలో అయినా ఆయనకు ఆయనే సాటి - ఆయనకు ఆయనే పోటీ అని కేశినేని అన్నారు.
సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడని కొనియాడారు.ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సమాజంలో జరుగుతున్న అసమానతలను గుర్తించి, పేద బడుగు బలహీన వర్గాలకు అందని ద్రాక్షలాగా ఉన్న సంక్షేమ ఫలాలను పూర్తిగా వారికి అందించాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ స్థాపించబట్టే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు రాజకీయాలోకి రావడానికి, ప్రజా సేవ చేయడానికి అవకాశం లభించిందన్నారు. ప్రపంచంలో పుట్టిన రోజును, మరణించిన రోజును ప్రజలు ఘనంగా జరుపుకునే ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు అని అన్నారు.