రైతు దీక్షపై వైకాపా దాడి : రైతుపై చేయి వేసినవాడు నాశనమే : నారా లోకేశ్

శనివారం, 25 జనవరి 2020 (15:36 IST)
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద టీడీపీ, ఐకాస శ్రేణులు రిలే దీక్షను చేపట్టాయి. ఈ దీక్షా శిబిరంపై వైకాపా శ్రేణులు టమోటాలు, కోడిగుడ్లతో దాడికి దిగాయి. అంతేకాదు శిబిరానికి నిప్పు పెట్టి, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు శిబిరానికి అంటుకున్న మంటలను ఆర్పివేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాదన జరిగింది.
 
వైసీపీ శ్రేణులు చేసిన దాడిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఖుద్దూస్ గాయపడ్డారు. ఈ దాడి సమాచారం అందుకున్న వెంటనే మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాదర్ దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో, మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
 
మరోవైపు, ఈ దాడిపై టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "రైతులపై దాడి చేయించి రైతు ద్రోహిగా జగన్‌ గారు మరింత దిగజారారు. ప్రజల్ని ఒప్పించలేని వాడే దాడులకు తెగబడతాడు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవు అన్న విషయం ప్రజలకు అర్థమైపోయిందనే ఆందోళన జగన్ గారిని వెంటాడుతోంది. 
 
అందుకే వైకాపా రౌడీలను రంగంలోకి దింపి శాంతియుతంగా రైతులు దీక్ష చేస్తున్న తెనాలి అమరావతి జేఏసీ శిబిరానికి నిప్పు అంటించారు. రైతులు, మహిళలపై విచక్షణారహితంగా వైకాపా గుండాలు దాడులు చేశారు. తెనాలిలో వైకాపా దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్ గారి తాటాకు చప్పుళ్ళకు భయపడే వారు ఎవరూ లేరు. రైతుల పై చెయ్యి వేసిన వాళ్ళు నాశనం అయిపోతారన్న విషయం గుర్తుపెట్టుకోండి జగన్ గారు" అంటూ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు