సబ్జెక్టు లేని సీఎం దెబ్బకు హెచ్ఎస్‌బీసీ మూతపడింది : నారా లోకేశ్

గురువారం, 16 డిశెంబరు 2021 (13:50 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోమారు విమర్శళు గుప్పించారు. సబ్జెక్టులేని ముఖ్యమంత్రి జగన్ దెబ్బకు అన్ని కంపెనీలు ఖాళీ చేసి పక్క రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయంటూ ఆరోపించారు. ముఖ్యంగా, విశాఖపట్టణం కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన హెచ్.ఎస్.బి.సి బ్యాంకు పూర్తిగా మూసివేయడానికి ఏపీ ప్రభుత్వమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. 
 
విశాఖలోని సిరిపురం జంక్షన్‌లో ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఉండేదన్నారు. ఇపుడు ఇది చరిత్ర పుటల్లో కలిసిపోయిందంటూ ఓ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని నారా లోకేశ్ పోస్ట్ చేశారు. ఈ కంపెనీని యాజమాన్యం పూర్తిగా మూసివేసి, భవనాన్ని ఖాళీ చేసిందని అందులో పేర్కొంది. ఈ ప్రాంగణం ఇపుడు వెలవెలబోతోంది. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో పేరు పొందిన హెచ్ఎస్‌బీసీ వివిధ దేశాల్లో తన బ్యాంకులకు ఇక్కడ నుంచే సేవలు అందించేదని, యువత వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పించిందని ఆ పత్రికా కథనం వెల్లడించింది. ఈ అంశాలను నారా లోకేశ్ గుర్తుచేశారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే తలాతోక లేని నిర్ణయాలు, వైకాపా నేతల బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్‌గా ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయి. ఇపుడు విశాఖకే తలమానికంగా ఉన్న హెచ్ఎస్‌బీసీ కూడా మూతపడటం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు