కోర్టులను రద్దు చేస్తారా? శుక్రవారాన్ని కూడా తీసేస్తారా జగన్‌గారూ : లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు
సోమవారం, 27 జనవరి 2020 (18:43 IST)
సీఎం జగన్ సర్కారు శాసనమండలి రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన నిర్ణయాన్ని కోర్టు వ్యతిరేకించిందనీ కోర్టులను కూడా తీసేస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి గారూ... అంటూ ప్రశ్నించారు.
ఇదే అంశంపై లోకేశ్ చేసిన ట్వీట్ల వివరాలను పరిశీలిస్తే, "అవాస్తవాలే ఊపిరిగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బ్రతుకుతున్నారు. మండలిలో ఇప్పటి వరకూ 38 బిల్లులు ఆమోదం పొందాయి. రెండు బిల్లులకు సవరణలు అడిగాం. రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి. అసలు చేసిన అభివృద్ధి శూన్యమైన్నప్పుడు మండలిలో అభివృద్ధిని అడ్డుకున్నారు అనడంలో అర్థం లేదు.
పేద రాష్ట్రంలో మండలి భారంగా మారిందని, శాసనసభలో తీర్మానం చేస్తే మండలి రద్దు అయినట్టే అని జగన్ అంటున్నారు. మరి నైతిక బాధ్యతగా ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్సీలు, సంతలో పశువుల్లా మీరు కొన్న ఇద్దరు ఎమ్మెల్సీలతో ఎప్పుడు రాజీనామా చేయిస్తున్నారు జగన్ గారు?
తీవ్ర ఆర్థిక నేరగాడైన జగన్‌గారికి కోర్టు మినహాయింపు దక్కలేదు. కోర్టులను రద్దు చేస్తారా? లేదా ప్రతి శుక్రవారం వెళ్లక తప్పదని శుక్రవారాన్ని తీసేసి వారానికి ఆరు రోజులే అని జీవో తెస్తారా?
కొన్ని బిల్లులు ప్రజాభిప్రాయం కోసం సెలెక్ట్ కమిటీకి వెళ్లాయి. బిల్లులు ప్రజాభిప్రాయానికి వెళితే జగన్‌గారు ఎందుకు వణికిపోతున్నారు? మండలి రద్దుతోనే మూడు ముక్కలాట ప్రజలు కోరుకున్నది కాదు.. ఆయన స్వార్థ నిర్ణయం అని స్వయంగా జగన్ గారే ఒప్పుకున్నారు.
ప్రజల ఆకాంక్షకు కాకుండా తమ స్వార్థానికీ, ద్వేషానికీ మాత్రమే ప్రాధాన్యం ఇచ్చిన నేతలు చరిత్రలో నియంతలుగానే మిగిలిపోయారు. తెలుగునేలపై అలాంటి హీన చరిత్రను సొంతం చేసుకుంటున్న మొదటి వ్యక్తి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే, అధికార మదంతో వైకాపా నాయకుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైకాపా నాయకులు ప్రజలపై దాడి చేసి గ్రామాలు ఖాళీ చేయించినప్పుడు అది రెండు వర్గాల మధ్య గొడవ అని పోలీస్ బాస్ లు కొట్టి పారేసారు.
ప్రతిపక్ష నాయకుడిపై వైకాపా వాళ్లు దాడికి పాల్పడితే పోలీస్ బాస్‌లు అది భావప్రకటనా స్వేచ్ఛ అన్నారు. ఇప్పుడు ఏకంగా వైకాపా నేతలు పోలీసులనే కొడుతున్నారు. మైలవరంలో అటవీశాఖ అధికారులపై వైసీపీ నేతలు దౌర్జన్యం చేసారు.
శ్రీకాకుళం జిల్లాలో సంతకవిటి మండలం, ఎస్ రంగరాయపురం వైసీపీ నేత, స్థానిక ఎస్సైపై దాడి చేసాడు. ఇప్పుడైనా యాక్షన్ తీసుకుంటారా లేక పోలీస్ బాస్‌లు ఇది కూడా భావప్రకటనా స్వేచ్ఛలో భాగం సర్దుకుపోవాలి అని కింద స్థాయి పోలీసులకి హితవు పలుకుతారా?" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.