సోదరి భర్తను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టిన నయీమ్

బుధవారం, 21 సెప్టెంబరు 2016 (11:25 IST)
గ్యాంగ్‌స్టర్ నయీమ్ కేసులో డొంకలు కదులుతున్నాయి. నయీమ్‌కు నల్లగొండతోపాటు ఇతర జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యమే అయినా.. అందుకు సంబంధించిన ఆధారాలు లేకపోవడంతో అవి ఇన్నాళ్లూ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. కానీ ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులకు తాజాగా దొరికిన ఆధారాలు ప్రకంపనలను సష్టించేలా ఉన్నాయి. 
 
నయీమ్ తన బావను మూడేళ్ల కిందట రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రాంతంలోనే హత్య చేసినట్లు సిట్ విచారణలో తేలింది. అతని సోదరి భర్త విజయ్‌కుమార్ అలియాస్ నదీమ్‌ను అతి కిరాతంగా మట్టుపెట్టి శంషాబాద్ మండలం పెద్ద తూఫ్రన్ సమీపంలో పెట్రోలు పోసి తగులబెట్టాడని అధికరులు వెల్లడించారు. 
 
పోలీసుల కథనం ప్రకారం.. 2013 ఫిబ్రవరి 2న రంగారెడ్డి జిల్లా పెద్దతూఫ్రన్-చిన్నతూఫ్రన్ రోడ్డు సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని పొలాల్లో ఉన్న గుంతల్లో పడేసి పెట్రోలు పోసి తగులబెట్టారు. 
 
మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో అతని ఆచూకీ తెలియలేదు. మృతుడి ఒంటిపై ఎర్రరంగు డ్రాయర్, నైట్ ప్యాంటు మాత్రమే ఉన్నాయి. హతుడికి సంబంధించి ఆధారాలు లభించకపోవడంతో గుర్తుతెలియని వ్యక్తి మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి