పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ స్ధలాలు ఆక్రమణల క్రమబద్దీకరణకు సంబంధించి, దారిద్ర్యరేఖ కు ఎగువున వున్న కుటుంబాలకు శ్లాబులవారీగా రుసుములు వసూలు చేయాలని నిర్ణయం. ఆక్రమణల క్రమబద్దీకరణకు సంబంధించి సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
ఉపముఖ్యమంత్రి కే.ఈ క్రిష్ణమూర్తి నేత్రుత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఆర్ధికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్రపునేఠా, సర్వే సెటిల్మెంట్ కమీషనర్ విజయమోహన్, ఐ.జి రిజిస్ట్రేషన్ వెంకటరామిరెడ్డి ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
100 గజాల లోపు ఆక్రమణలలో దారిద్ర్యపు రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా క్రమబద్దీకరణ చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. 100 గజాల పైన ఉన్న ఆక్రమణల్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఉన్న మార్కెట్ వ్యాల్యూను ద్రుష్టిలో పెట్టుకొని ఆక్రమణలను క్రమబద్దీకరించేందుకు వేరు వేరు రుసుములను మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.
గ్రామీణ ప్రాంతాల్లో 100 గజాల లోపు ఆక్రమణలను దారిద్ర్యరేఖకు ఎగువున ఉన్న కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతాన్ని వసూలు చేయాలని నిర్ణయించిన మంత్రివర్గ ఉపసంఘం,101 నుంచి 250 గజాల వరకు ఉన్న ఆక్రమణలను రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం అలాగే 251 నుంచి 500 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతం వసూలు చేయాలని ఉపసంఘం నిర్ణయించింది.
అలాగే పట్టణ ప్రాంతాల్లో100 గజాల లోపు ఆక్రమణలను దారిద్ర్యరేఖకు ఎగువున ఉన్న కుటుంబాలకు రిజిస్ట్రేషన్ విలువలో 15 శాతం వసూలు చేసి ఆక్రమణలను క్రమబద్దీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 100 నుంచి 250 గజాల వరకు ఉన్న ఆక్రమణలను రిజిస్ట్రేషన్ విలువలో 25 శాతం, అలాగే 251 నుంచి 500 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం చెల్లించి భూమిని క్రమబద్దీకరించుకోవచ్చని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది. 01/01 /2014 వరకు ఉన్న ఆక్రమణలు క్రమబద్దీకరించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిన రేట్లను వర్తింపజేయాలని తెలిపారు.