ఆదిత్య ఫార్మసీ ఎండీ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఏంటది?

ఠాగూర్

ఆదివారం, 20 జులై 2025 (10:56 IST)
ఆదిత్య ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ నరసింహ మూర్తి రాజు ఆత్మహత్య చేసుకున్న కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ నెల ఐదో తేదీన ఆయన విజయవాడలోని అయోధ్య నగర్‌‍లోని ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఈ కేసులో తాజాగా కీలక ములుపు చోటుచేసుకుంది. 
 
విశాఖకు చెందిన బుద్ధంరాజు శివాజీ, విజయవాడకు చెందిన పిన్నమనేని పరంధామయ్య ఆయన ఆత్మహత్యకు కారణమంటూ మృతుడి భార్య శాంతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీసుకున్న అప్పు తీర్చాలంటూ పలుమార్లు ఫోన్లు చేసి వేధించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
తన భర్తకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడడంతోనే ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారని ఆమె చెప్పడంతో పోలీసులు అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. శివాజీ, పరంధామయ్య... నరసింహమూర్తి రాజును బెదిరించారా? ఎన్నిసార్లు ఫోన్ చేశారు? తదితర విషయాలు తెలుసుకునేందుకు ఫోన్ కాల్ డేటా సేకరించి విశ్లేషిస్తున్నారు.
 
ఆయా వివరాలు బయటకు వస్తే.. నిజానిజాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. కాగా, నరసింహమూర్తి రాజు ఆత్మహత్య తర్వాత నుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు. దాంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శివాజీ, పరంధామయ్యలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులిద్దరిపై బీఎన్ఎస్ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు