జీవీఎల్‌, రాంమాధవ్‌, మురళీధర్‌రావుల‌పై వేటు.. టీడీపీ ఎఫెక్టేనా?

శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:26 IST)
బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఆ పార్టీ సీనియర్‌ నాయకులు జీవీఎల్‌ నర్సింహ్మారావు, రాంమాధవ్‌, మురళీధర్‌రావుల‌పై వేటు వేశారు. జాతీయ కార్యవర్గంలో వారికి స్థానం కల్పించలేదు. ఈ రోజు ప్రకటించిన కార్యవర్గంలో 11 మంది ఉపాధ్యక్షుల‌ను నియమించారు.

వీరిలో తెలుగు రాష్ట్రాల‌ నుంచి డి.కె.అరుణకు ఉపాధ్యక్షురాలిగా అవ‌కాశం ఇవ్వ‌గా, మరో సీనియర్‌ మహిళా నేత ‘దగ్గుబాటి పురంధేశ్వరి’ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరితో పాటు తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు డాక్టర్‌ కె.ల‌క్ష్మణ్‌ను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా నియ‌మించగా, ఏపీకి చెందిన ‘సత్యకుమార్‌’ జాతీయ కార్యదర్శిగా యథావిధిగా కొనసాగనున్నారు.

ఇంతకు ముందు ప్రధాన కార్యదర్శిలుగా ఉన్న ‘రాంమాధవ్‌, మురళీధర్‌రావు, అధికార ప్ర‌తినిధిగా ఉన్న‌ జీవీఎల్‌’కు ఎటువంటి పదవులు ఇవ్వలేదు. బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆంధ్రప్రదేశ్‌లో ‘జి.వి.ఎల్‌.నర్సింహ్మారావు, రాంమాధవ్‌’లు క్రియాశీల‌కంగా వ్యవహరిస్తున్నారు. వీరిలో జీవీఎల్‌ నర్సింహ్మారావు అధికార వైకాపాకు గట్టిగా మద్దతు ఇస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది.

మరో వైపు ‘రాంమాధవ్‌’ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారనే మాట ఆయా వర్గాల‌ నుంచి వ్యక్తం అవుతోంది. తెలంగాణలో ‘మురళీధర్‌రావు’ కూడా అక్కడి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారనే విమర్శులు ఉన్నాయి.

మొత్తం మీద..మొన్నటి దాకా క్రియాశీల‌కంగా ఉన్న ‘జీవీఎల్‌, రాంమాధవ్‌, మురళీధర్‌రావు’ల‌కు పార్టీ జాతీయ కార్యవర్గంలో ఎటువంటి స్థానం కల్పించకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతోంది. కాగా ‘జీవీఎల్‌’, రాంమాధవ్‌ల‌కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని, అందుకే పార్టీ పదవుల్లోకి వారిని తీసుకోలేదనే మాట వినిపిస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు