డొక్కాకు ఏ పార్టీ శాశ్వతం కాదు: వర్ల రామయ్య

మంగళవారం, 10 మార్చి 2020 (07:28 IST)
గతంలో సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసి, తరువాత టీడీపీలోకి వచ్చి, ఇప్పుడు వైసీపీ గూటికి చేరిన డొక్కా మాణిక్యవరప్రసాద్.. తనకు ఏ పార్టీ కూడా శాశ్వతమైన రాజకీయవేదిక కాదని ఆయనే చెప్పాడని, దాన్నిబట్టే ఆయన భవిష్యత్ లో ఇంకోపార్టీలోకి వెళతాడని స్పష్టంగా అర్థమవుతోందని టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య స్పష్టంచేశారు.

ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి వచ్చిప్పటికీ టీడీపీ డొక్కాకు కీలకమైన పదవులిచ్చిందని, ఎమ్మెల్సీ, మినిమమ్ వేజెస్ బోర్డు ఛైర్మన్ సహా, పార్టీ అధికార ప్రతినిధి హోదాను కూడా కట్టబెట్టి, ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.

అలా కొనసాగిన వ్యక్తి, నేడు పార్టీకి రాజీనామా చేశారని, ఆయన రాసిన లేఖలో నాటకీయంగా తనకు తాడికొండ స్థానం కేటాయించారని చెప్పడం జరిగిందన్నారు. టీడీపీ కోర్ కమిటీలో చర్చించి, డొక్కాను సంప్రదించాకే, ఆయనకు ప్రత్తిపాడు స్థానం కేటాయించమైందని, తాడికొండ స్థానంలో పోటీచేయడానికి తెనాలి శ్రావణ్ కుమార్ ఉండగా, అతన్ని కాదని డొక్కాకు ఎలా కేటాయిస్తారని రామయ్య ప్రశ్నించారు.

డొక్కా చెప్పిన నాటకీయ పరిస్థితులు ఎక్కడున్నాయో ఆయనే చెప్పాలన్నారు. శాసనమండలిలో డొక్కా హాజరు అత్యంత ఆవశ్యకమైన రోజునే, ఆయన గైర్హాజరయ్యారని, ఆయన ఎక్కడినుంచైతే పోటీచేయాలని భావించారో, ఆ తాడికొండ నియోజకవర్గం ఉన్న రాజధానిప్రాంతానికి అన్యాయం జరుగుతున్నవేళే, డొక్కా అలా ఎందుకు చేశాడని రామయ్య నిలదీశారు.
 
దళితవర్గాలు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తున్న వేళ, డొక్కా మండలికి గైర్హాజరయ్యాడని, ఆనాడే ఆయన వైసీపీవైపు మొగ్గాడని రాష్ట్రప్రజానీకానికి అర్థమైందన్నారు. టీడీపీ కూడా ఆనాడే డొక్కా పార్టీ మారుతున్నాడని భావించిందన్నారు.

మండలిని శాసనసభే ఏర్పాటు చేసిందన్న వ్యాఖ్యకూడా ఆనాడు డొక్కా మాటల్లో ధ్వనించిందని, అదికూడా సరైంది కాదన్నారు. శాసనసభ తీసుకునే నిర్ణయాల్లోని తప్పొప్పులను ఎత్తిచూపుతూ, మార్పులు, చేర్పులు సూచించే మండలిని, సీనియర్ సభ్యుడైన డొక్కా తప్పుపట్టడం సరికాదన్నారు.

కాంగ్రెస్ నుంచి టీడీపీ, టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన డొక్కాకు ఆ పార్టీలో మంచి జరగాలని కోరుకుంటున్నట్లు వర్ల తెలిపారు. కాగా వైసీపీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తుంద‌ని ఆరోపిస్తూ వర్ల రామయ్య ఎన్నికల కమిషన‌ర్ ర‌మేష్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు