మోడీపై అసదుద్ధీన్ ఓవైసీ ఫైర్.. నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలట..

గురువారం, 10 నవంబరు 2016 (12:10 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రూ.500, రూ.1000 వంటి పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు మోడీ సర్కారు ప్రకటించిన నేపథ్యంలో మోడీ రూ.2వేల నోటును ఎందుకు ప్రవేశపెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి నిర్మూలన కోసం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదని ఓవైసీ వ్యాఖ్యానించారు. 
 
ఇంకా ప్రధాన మంత్రి తీసుకున్న నిర్ణయం అనుచితమని.. ఈ నిర్ణయం ద్వారా కూలీలకే కష్టాలన్నారు. దినసరి కూలీలు, ప్లంబర్లు, మెకానిక్‌లు, డ్రైవర్లు వంటి వారితో ముడిపడే అంశాన్ని పట్టించుకోకుండా దారుణమైన పరిస్థితి కల్పించారంటూ విరుచుకుపడ్డారు. దేశంలో రెండు శాతం మాత్రమే క్యాష్‌లెస్ లావాదేవీలు జరుగుతున్నాయన్న ఆయన, వారి కోసం మిగతా 98 శాతాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా నోట్ల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓవైసీ డిమాండ్ చేశారు.
 
ఇదిలా ఉంటే.. గురువారం నుంచి పోస్టాఫీసుల్లో పాత కరెన్సీ స్థానంలో కొత్త కరెన్సీని మార్చుకోవచ్చని కేంద్ర ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మధ్యాహ్నం అయినా ఏ పోస్టాఫీసుకూ కొత్త రూ. 500, రూ. 2000 నోట్లు చేరలేదు. ఇంకా బ్యాంకులకే పూర్తి స్థాయిలో నోట్ల బట్వాడా పూర్తికాకపోగా, పోస్టాఫీసులకు పంపే ప్రయత్నాలు ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం.

వెబ్దునియా పై చదవండి