అనకాపల్లిలో విషాదం - సముద్రంలో కొట్టుకెళ్లిన ఆరుగురు స్నేహితులు

సోమవారం, 21 ఆగస్టు 2023 (14:34 IST)
అనకాపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. వారాంతంలో సరదాగా గడిపేందుకు బీచ్‌కు వెళ్లిన ఆరుగురు స్నేహితులు సముద్రంలోకి కొట్టుకునిపోయారు. దీంతో అప్రమత్తమైన స్థానిక జాలర్లు ఐదుగురిని రక్షించారు. గల్లంతైన ఒకరి మృతదేహం కోసం గాలిస్తున్నారు. అయితే, ఆ మృతదేహం తీరానికి కొట్టుకుని వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణానికి చెందిన కట్టోజు సాయి (19), కట్టోజు కావ్య (17), సింహాచలానికి చెందిన గన్నవరపు సాయి ప్రియాంక (27), గన్నవరపు రవిశంకర్ (28), అల్లిపురానికి చెందిన కండిపల్లి ఫణీంద్ర (25), కండిపల్లి సాయికిరణ్ (25) కలిసి ఆదివారం ఉదయం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలోని సీతపాలెం బీచ్‌కు వివార యాత్రకు వెళ్లారు.
 
అందరూ కలిసి ఆనందంగా గడుపుతూ స్నానాలు చేశారు. ఆ తర్వాత తీరం సమీపంలోని రాళ్లపై నిలబడి ఫొటోలు తీసుకుంటున్న సమయంలో పెద్ద కెరటం ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. దీంతో అందరూ ఒక్కసారిగా సముద్రంలో పడికొట్టుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు వారిని రక్షించేందుకు సముద్రంలో దూకారు.
 
సాయి అప్పటికే కొట్టుకుపోగా మిగతా ఐదుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. సాయి ప్రియాంక సముద్రపు నీటిని తాగేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. గల్లంతైన సాయి మృతదేహం ఆ తర్వాత అచ్యుతాపురం మండలంలోని పూడిమడక తీరానికి కొట్టుకొచ్చింది. కోమాలోకి వెళ్లిన సాయి ప్రియాంక ప్రస్తుతం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
 
తీరానికి కొట్టుకొచ్చిన సాయి మృతదేహాన్ని వాహనంలో తరలించే వీలులేకపోవడంతో అచ్యుతాపురం ఎస్సై సన్యాసినాయుడు ఆధ్వర్యంలో పోలీసులు రెండు కిలోమీటర్ల మేర మోసి మానవత్వం చాటుకున్నారు. అనంతరం అంబులెన్సులో అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు