స్వామి కరుణించవా? ఆన్‌లైన్‌లో నో టిక్కెట్స్, ఆఫ్ లైన్లో టిక్కెట్ల కోసం పడిగాపులు?

మంగళవారం, 9 జూన్ 2020 (18:38 IST)
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్సనం కోసం ఆన్లైన్లో టిటిడి ఇప్పటికే 3 వేల టిక్కెట్లను పొందుపరిచింది. అయితే ఆన్లైన్‌లో హాట్ కేకుల్లా టిక్కెట్లను బుక్ చేసేశారు భక్తులు. సైట్ ఓపెన్ చేసిన కొద్దిసేపటికీ మొత్తం టిక్కెట్లు అయిపోయాయి. ఈనెల 11వతేదీ భక్తులను దర్సనానికి అనుమతించనుంది టిటిడి.
 
ఇప్పటికే రెండు రోజుల పాటు టిటిడి ఉద్యోగుల ట్రయల్ రన్ పూర్తయ్యింది. టిటిడి ఉద్యోగులు, సిబ్బంది కుటుంబ సభ్యులు కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. రేపు తిరుమల స్థానికులను దర్సనానికి అనుమతించనున్నారు. ఇప్పటికే తిరుమలలో దీనికి సంబంధించిన టోకెన్లను అందజేశారు.
 
అయితే భక్తులను మాత్రం 11వ తేదీ నుంచి దర్శనానికి అనుమతిస్తారు. ఒకరోజు ముందుగా ఆఫ్‌లైన్‌లో అంటే కౌంటర్ల ద్వారా టిక్కెట్లను అందించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టిటిడి పూర్తి చేసింది. తిరుపతిలోని బస్టాండ్, విష్ణునివాసం, అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టిక్కెట్లను అందించనుంది. 
 
రేపు ఉదయం 5 గంటల నుంచి టిక్కెట్లను ఇవ్వనున్నట్లు టిటిడి తెలిపింది. అయితే పెద్ద ఎత్తున క్యూలైన్లను ఏర్పాటు  చేశారు టిటిడి అధికారులు. సామాజిక దూరాన్ని పాటిస్తూ టిక్కెట్లను పొందేందుకు అన్ని చర్యలు తీసుకున్నారు. 
 
ఆన్‌లైన్‌లో కొద్దిసేపటికే టిక్కెట్లు అయిపోతే ఇక ఆఫ్‌లైన్‌లో 40 నుంచి 50 నిమిషాల్లోనే టిక్కెట్లు అయిపోయే అవకాశం ఉందని టిటిడి అధికారులు భావిస్తున్నారు. అయితే ఎలాగైనా కౌంటర్లలో టిక్కెట్లు పొంది స్వామివారిని దర్సించుకోవాలని భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి తరలివస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు