వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పెరుగుతోంది. పాదయాత్రలో వైసీపీ అధినేత జగన్ 125 నియోజక వర్గాలు మాత్రమే పాదయాత్ర చేస్తారని.. మిగిలిన నియోజక వర్గాల్లో బస్సు యాత్ర చేస్తారని వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్కే రోజా తెలిపారు.
అస్సలు జగన్ 125 నియోజక వర్గాల్లో మాత్రమే పాదయాత్ర ఎందుకు చేస్తున్నారనే దానిపై చర్చ మొదలైంది. ఆరు నెలల పాటు పాదయాత్ర పైనే దృష్టి పెడితే మిగతా కార్యక్రమాల్లో ముందుకు సాగలేం, అదికూడా 6 నెలల్లో 175 నియోజకవర్గాల్లో పాదయాత్ర చెయ్యాలంటే సమయం వుండదనే ఆలోచనతోనే జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
మరోవైపు గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జగన్ సీఎం కావాలని కోరుతూ తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను వైసీపీ అధికార ప్రతినిధి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, 2019లో జరగనున్న ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడం, జగన్ సీఎం కావడం ఖాయమని చెప్పారు.