19న ‘పరిషత్‌’ కౌంటింగ్‌

శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (08:55 IST)
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు హైకోర్టు ధర్మాసనం తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో ఈనెల 19వ తేదీన ‘పరిషత్‌’ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియను చేపట్టి అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది.

ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని గురువారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్‌ నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని, విజయోత్సవాలు నిర్వహించరాదని ఎస్‌ఈసీ స్పష్టం చేశారు. పరిషత్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఈనెల 18వతేదీ సాయంత్రం ఐదు గంటలలోగా కౌంటింగ్‌ ఏజెంట్ల వివరాలను ఆర్వోలకు అందచేయాలని సూచించారు.  
 
ఆ వ్యాఖ్యలపై ఆక్షేపణ.. 
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అంతకుముందు ఉదయం హైకోర్టు ధర్మాసనం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా కోవిడ్‌ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఓట్ల లెక్కింపు చేపట్టవద్దని, ఫలితాలను వెల్లడించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసింది.

మరోవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు గతంలో ఏ దశలో నిలిచిపోయాయో అక్కడి నుంచి తిరిగి నిర్వహించేందుకు వీలుగా మళ్లీ తాజా నోటిఫికేషన్‌ జారీ చేయాలని ఆదేశిస్తూ సింగిల్‌ జడ్జి ఈ ఏడాది మే 21న ఇచ్చిన ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు