విద్యా సంస్థలో మైనర్ బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం చేసి హత్య చేస్తే వైసీపీ ప్రభుత్వం ఇంతవరకూ నిందితులను ఎందుకు పట్టుకోలేకపోయింది, ఎందుకు శిక్షించలేకపోయిందంటూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.... పోలీసులకు న్యాయం చేయాలనే వుంది. కానీ రాజకీయ బాసుల వల్ల ఆగిపోయారు. సినిమాల్లో 2 గంటల్లో న్యాయాన్ని చూపించవచ్చు. కానీ నిజ జీవితంలో ఎలా న్యాయం చేయాలని ఆలోచించా.
సుగాలి ప్రీతికి న్యాయం జరగాలంటే దిశ హత్యాచారంపై ప్రజలు ఏవిధంగా రోడ్లెక్కారో అలాగే చేయాల్సిందే. నిందితులను కఠినంగా శిక్షించాల్సిందే. ఇక్కడ కర్నూలులో పలు రెసిడెన్షియల్ పాఠశాలలో బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. నిందితులను ఎన్‌కౌంటర్లు చేయమని చెప్పడంలేదు కానీ చట్టప్రకారం కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నాను.
విద్యా సంస్థలో అత్యాచారం జరిగిందంటే ఇక బాలికలకు రక్షణ ఎక్కడ. సీబీఐ విచారణకు రాత పూర్వకంగా అప్పగించకపోతే మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు కర్నూలులో జ్యుడియల్ క్యాపిటల్ పెట్టినా ప్రయోజనం శూన్యం. దిశ కోసం మాట్లాడినప్పుడు సుగాలి ప్రీతి గురించి జగన్ రెడ్డిగారు ఎందుకు మాట్లాడరు? సుగాలి ప్రీతికి న్యాయం జరిగితే నేను రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేదు" అని అన్నారు.