మనం అనుసరిస్తున్న మతాన్ని ఆరాధించాలని, ఇతరులు అనుసరిస్తున్న మతాన్ని గౌరవించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ముచ్చింతల్, శ్రీరామ నగరంలో జరుగుతున్న శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు ఆయన ఆదివారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించిన సమతామూర్తి శ్రీరామానుజ బంగారు విగ్రహాన్ని ఆయన సందర్శించారు. అలాగే, ఇక్కడ నిర్మించిన 108 దివ్యక్షేత్రాలను కూడా ఆయన దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు కూడా అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన మతాన్ని ఆరాధిస్తూనే పరమతాన్ని గౌరవించడం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని కోరారు. కాగా, పవన్ రాకతో శ్రీరామ నగరులో సందడి వాతావరణం నెలకొంది. ఆయనను చూసేందుకు, ప్రసంగం వినేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పవన్‌కు చిన్నజీయర్ స్వామి శాలువా కప్పి సత్కరించారు. పవన్ వెంట జనసేన పార్టీ సీనియర్ నేత నాదెండ్ల భాస్కరరావు కూడా ఉన్నారు.