2019 ఎన్నికల్లో అనంతపురం నుంచి పవన్ పోటీ: మహేందర్ రెడ్డి

శుక్రవారం, 10 నవంబరు 2017 (10:14 IST)
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై కొంత క్లారిటీ వచ్చింది. పవన్ అనంతపురం జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన జనసేన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ.. త్వరలోనే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కమిటీలు వేస్తామని తెలిపారు. పవన్ కల్యాణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారని తెలిపారు.
 
జనసేనలో పవన్ ఒక్కరు మాత్రమే సుప్రీమ్ అని, ఆయన మాట శిలాశాసనం అని  చెప్పారు. డిసెంబర్ తొలివారం తరువాత తన పూర్తి సమయాన్ని పార్టీ కోసమే కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు.
 
మరోవైపు పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో గురువారం బీజేపీ యువమోర్చ ఆధ్వర్యంలో నవభారత యువచైతన్య మహాసభ జరిగింది. ఆ సభలో ప్రసంగిస్తూ మాధవ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జనసేన లాంటి పార్టీలు వ్యక్తులు ఆధారంగా ఏర్పడినవని, అవి కుటుంబ పార్టీలంటూ విమర్శించారు. వ్యక్తి కేంద్రంగా ఏర్పడే పార్టీలు సదరు వ్యక్తి లేకపోతే కనుమరుగు అవుతాయని మాధవ్ చెప్పారు. ప్రజారాజ్యం, లోక్‌సత్తా ఉదంతాలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. 
 
జేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నాక లోక్‌సత్తా పరిస్థితి ఏంటో తెలుసని మాధవ్ వ్యాఖ్యానించారు. రేపటి రోజున క్రేజీవాల్ ఆమ్ ఆద్మీ అయినా, జనసేన అయినా ఇంతేనని తెలిపారు. తమ పార్టీ మాత్రం కుటుంబ పార్టీ కాదని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు