ఈదేశం కోసం గుండె కొట్టుకుంటోందని, తెలంగాణ కోసం రక్తమిస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తన తెలంగాణ రాష్ట్ర రాజకీయ యాత్రలో భాగంగా, కరీంనగర్‌లోని శుభం గార్డెన్స్‌లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ ఉద్యమం ఏ ఆశయాల కోసం జరిగిందో వాటి సాధన కోసం కలిసి వస్తానన్నారు. మడమ తిప్పే మనిషిని కాదని స్పష్టం చేశారు. మాట ఇస్తే తిరిగి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. జనసేనను వేరే పార్టీలో విలీనం చేయాల్సి వస్తే.. మీ ముందు ఎలా ఉంటానని ప్రశ్నించారు.
ఇకపోతే, 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ యువత, ఆడపడుచుల ఆకాంక్షే.. జనసేన ఆకాంక్ష. తెలంగాణ ఆశయాల కోసం జనసేన నిలబడుతుందన్నారు. అండగా ఉండండి.. మీ కుటుంబంలో తనను ఒకడిగా చూడండిని కార్యకర్తలను కోరారు.
తాను ఎవరికీ తొత్తును కాదన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఎవరితోనూ శతృత్వం లేదన్న పవన్.. విమర్శించే వారిని పట్టించుకునేందుకు తనకు సమయం లేదన్నారు. తన పనితాను చేసుకుంటూ ముందుకుసాగిపోతానని చెప్పారు. అలాగే, ఎవడికీ భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.