భూ సమస్యలపై పవన్ పప్పులో కాలేసినట్లేనా?

మంగళవారం, 24 జనవరి 2017 (06:50 IST)
పోలవరం, అమరావతి రైతుల సమస్యల గురించి ట్వీట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడి భూముల స్థితిగతులపై తప్పుగా అర్థం చేసుకున్నారా? లేక ఎవరయినా ఆయనను తప్పుదోవ పట్టించారా? ఇప్పడు ప్రధానంగా ఏపీలో జరుగుతున్న చర్చ ఇదే మరి. 
 
పోలవరం ప్రాజెక్టు, అమరావతిలో రైతుల సమస్య ఊహించన దానికంటే ఎక్కువే అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఇక్కడి భూములను అంచనా వేయడంలో పవన్ ఎక్కడో పప్పులో కాలేశారనిపిస్తోంది. ఉదాహరణకు అమరావతిని చూద్దాం. ఇక్కడి లంకభూములు అసైన్డ్ భూములు. పంటపండించుకోవడానికి ప్రభుత్వం వాటిని రైతులకు ఇచ్చింది కానీ వాటిని అమ్మే హక్కు ఇవ్వలేదు.
ఇలాంటి భూములను అభివృద్ధి ప్రాజెక్టులకోసం తీసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా కూడా రైతులకు ఇచ్చే నష్టపరిహారం తక్కువగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వాటిని ఉచితంగా తీసుకున్న దాఖలాలున్నాయి. 
 
ఇక పోలవరానికి వస్తే అది పూర్తిగా భిన్నమైన సమస్య. ఈ ప్రాజెక్టు గత పదేళ్లుగా నిర్మాణంలో ఉందన్నది అందరికీ తెలుసు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే వీటిలో కొన్ని భూములను తీసుకున్నారు. ఒప్పందాలపై సంతకాలు కుదుర్చుకుని తర్వాతే నష్టపరిహారం చెల్లించారు.
 
అయితే భూసేకరణ మాత్రం చంద్రబాబు హయాంలోనే జరిగింది.  భూసేకరణ ప్రక్రియను సులభతరం చేయడానికి, భూములివ్వడానికి తిరస్కరిస్తున్న రైతులకు ప్రభుత్వం మంచి ప్యాకేజిని ప్రతిపాదించింది. దీంతో అప్పట్లోనే భూములను ఇచ్చివేసిన రైతులు తమకు కూడా కొత్త సహాయ ప్యాకేజీకింద నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వారికి కూడా అలాంటి ప్యాకేజినే ఇవ్వాలంటే ప్రభుత్వానికి సాధ్యం కాదు.
 
అంటే పోలవరం, అమరావతి రైతుల సమస్యలను పరిశీలిస్తున్నప్పుడు ఆరోపణల వెనుక వాస్తవాలను తప్పక అంచనా వేయవలసిం ఉంటుంది. పవన్ కల్యాణ్‌కి ఈ విషయాలు తెలుసా, ఎవరైనా చెప్పారా, లేక నిజంగా తెలీదా అనేదే ఇప్పుడు సమస్య.
 

వెబ్దునియా పై చదవండి