రతన్ టాటా పారిశ్రామికవేత్తనే కాదు... గొప్ప మానవతావాది : పవన్ కళ్యాణ్

ఠాగూర్

గురువారం, 10 అక్టోబరు 2024 (13:07 IST)
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్, పద్మ విభూషణ్ రతన్ నోవల్ టాటా మృతి భారతదేశానికి తీరని లోటని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రతన్ టాటా మృతిపై ఆయన తన సంతాప సందేశాన్ని వెల్లడించారు. 
 
భారత పారిశ్రామిక రంగానికే కాదు, ప్రపంచ పారిశ్రామిక రంగానికి రతన్ టాటా ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఆయన నేతృత్వంలో ఉప్పు నుండి మొదలుకొని, విమానయాన రంగంలో వరకు భారత దేశపు అణువణువులో టాటా అనే పేరు ప్రతిధ్వనించేలా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని గుర్తు చేశారు. 
 
ఆయన హయాంలో టాటా అంటే భారతదేశపు ఉనికిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలబెట్టారనీ, ఆయన కేవలం పారిశ్రామికవేత్తగానే కాకుండా గొప్ప మానవతావాదిగా సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమన్నారు. 
 
ఈ బాధాకరమైన సమయంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, టాటా గ్రూప్ సంస్థల కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. రతన్ టాటా అనే పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందనీ, ప్రతి తరానికి ఆదర్శప్రాయంగా నిలచిన మహోన్నత వ్యక్తికి అంతిమ వీడ్కోలు తెలియజేస్తున్నట్టు పవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు