మనిషి మర్చిపోవడం సహజమని, కానీ, ఎవరైతే అన్నం పెట్టారో, నిలబడ్డారో, పని చేసారో వారిని కూడా మర్చిపోతాం మనం. కానీ వారిని గుర్తుంచుకోవడం చాలా అవసరం. మనం ఎవరి నుండి వచ్చామో గుర్తు ఉంచుకోవడం చాలా అవసరం అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసిన పవన్ కల్యాణ్ ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ఒక జాతికి, ఒక కులానికి నాయకుడు కాదని... ఆయన ఆంధ్ర జాతికి నాయకుడు అని కీర్తించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించాలంటే ఆర్య వైశ్య సమాజానికి వెళ్లే అవసరం లేకుండానే ఆయనను గౌరవించుకునేలా ఉండాలని పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని తెలిపారు.
'మనిషికి మరపు సహజం. మనకు అన్నం పెట్టినవారిని, మనకు తోడుగా నిలిచిన వారిని, మనకు అండగా నిలబడిన వారిని మర్చిపోతారు... కానీ అలాంటి వారిని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. మనం ఎక్కడినుంచి వచ్చాం అనేది మర్చిపోకూడదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం విలువ ఏంటో అర్థమైంది.