తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ''పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు. రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం దృష్టి సారించాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరం. వ్యక్తులు, పార్టీ కార్యాలయాలపై దాడులు అరాచకానికి దారి తీస్తాయి. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలి. నిందితులను శిక్షించకపోతే రాష్ట్రం అరాచకానికి చిరునామాగా మారుతుంది'' అని పవన్ కల్యాణ్ అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యాలయాలపై దాడిని నిరసిస్తూ టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు(బుధవారం ) రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరి టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ''ప్రతిపక్ష నాయకుడి ఇంటిపై దాడి చేస్తారా..! డ్రగ్స్ మాఫియాపై మీరు వత్తాసు పలుకుతారా..? ఇది చాలా దుర్మార్గమంటూ మండిపడ్డారు. దీనిపై రేపటి నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి నిరసన తెలియజేయాలని బంద్‌కు పిలుపునిచ్చారు.
దాడులపై ఫోన్ చేస్తే గవర్నర్, కేంద్ర మంత్రి ఫోన్ ఎత్తారని చంద్రబాబు చెప్పారు. కొందరు చేసే పనులతో మొత్తం పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని వ్యాఖ్యానించారు. రెండున్నరేండ్లు జరుగుతున్న వేధింపులను భరిస్తున్నామని, ఇప్పుడు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయన్నారు. ఈ దాడుల సమాచారం తెలియని వ్యక్తి డీజీపీ పదవికి ఎలా అర్హుడని చంద్రబాబు ప్రశ్నించారు.