సుగాలి ప్రీతి కేసుల పళ్లున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా తయారైందని ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ చీఫ్, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ కేసు గురించి మాట్లాడేందుకు ఏ ఒక్కరూ సాహసం చేయలేదన్నారు. చివరకు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు కూడా ఆ ధైర్యం చేయలేదన్నారు. కానీ, ఇపుడు తనపైనే సుగాలి ప్రీతి తల్లి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ కేసులో తన పరిస్థితి పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టుగా తయారైందన్నారు. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? అని పవన్ ప్రశ్నించారు.
వైజాగ్‌లో సేనతో సేనాని అనే కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లడుతూ, 'సుగాలి ప్రీతి కేసు వ్యవహారంలో నా పరిస్థితి పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు తయారైంది. చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా? గత ప్రభుత్వంలో సీఎం ఎదుట మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. ఆ సమయంలో ఆ తల్లి ఆవేదన చూసి కర్నూలు వెళ్లి బలంగా గళం వినిపించాను. ఆ పోరాట ఫలితంగా నాటి ప్రభుత్వం కేసును నడిపింది. కర్నూలుకు 9 కి.మీ. దూరంలో దిన్నెదేవరపాడులో బహిరంగ మార్కెట్లో ఎకరా రూ.2 కోట్లు ధర పలికే ఐదెకరాల వ్యవసాయ భూమి, కల్లూరులో 5 సెంట్ల ఇంటి స్థలం, సుగాలి ప్రీతి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు.
నేను ఉపముఖ్యమంత్రి అయ్యాక ఈ కేసుపై సీఐడీ చీఫ్‌తో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని సూచించాను. డీజీపీ, హోం మంత్రితోనూ మాట్లాడాను. విచారణలో అనుమానితుల డీఎన్ఏ సరిపోలడం లేదని, సాక్ష్యాలు తారుమారు చేశారని తేలింది. దీంతో కేసు విచారణకు ఇబ్బందులు కలుగుతున్నాయి అని పవన్ అంటూ, సుగాలి ప్రీతి తల్లి పార్వతి తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.