నేను గనక బయటకొచ్చానంటే ఉంటే వుంటా పోతే పోతా... పవన్ కళ్యాణ్ వార్నింగ్

శుక్రవారం, 27 జనవరి 2017 (17:45 IST)
పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకుంటే దాని అంతుచూసేవరకూ వదిలిపెట్టరని ఆయనకు బాగా సన్నిహితులుగా వుండేవారు చెపుతుంటారు. సినిమాలైనా... వ్యక్తిగత జీవితమైనా ఓ నిర్ణయం తీసుకుంటే చివరిదాకా దానికే కట్టుబడి వుంటారని అంటారు. ఇపుడు ఏపీ ప్రత్యేక హోదాను భుజానికెత్తుకున్న పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ముందుకు వస్తాడని అంటున్నారు. 
 
ఒక్కసారి నిర్ణయించుకుంటే ఇక సినిమాలు, వ్యక్తిగత జీవితం... అంతా వదిలేసి 13 జిల్లాల ప్రజల మధ్యే జీవితం సాగించేస్తారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మీ పాలసీలపై ప్రజలకు కమ్యూనికేట్ చేయాలి. పోలీసుల ద్వారా ప్రజలను కంట్రోల్ చేయాలని చూడటం తప్పు. అలా చేస్తే పోస్ట్‌పోన్ చేసినట్టే. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. 
 
అధికారంలో వున్నాం కనుక ఏమైనా చేస్తాం అని అనుకుంటే... నేను కేంద్ర ప్రభుత్వానికి గానీ, మిగతా నాయకులకు గానీ ఒకటే చెబుతూ ఉన్నా ప్రజల తరఫున మేం కూడా ఉంటే ఉంటాం. పోతే పోతాం అన్న స్థాయికి వస్తాం. నా విషయానికి వస్తే నేను వ్యక్తిగతంగా చెబుతున్నా. నాకు కుటుంబం ఉంది, పిల్లలున్నారు. నా కెరీర్ ఉంది. వీటన్నింటినీ వదులుకుని గొడవ చేయగలను. అన్నింటికీ సిద్ధపడే పాలిటిక్స్‌లోకి వచ్చా' అంటూ పవన్ మండిపడ్డారు. నిజంగా పవన్ కళ్యాణ్ ఇదే ఆచరిస్తే మాత్రం అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం ఉక్కిరిబిక్కిరి కాక తప్పదు. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా ఎంతమాత్రం వెనక్కి తగ్గేవిగా కనిపించడంలేదు. రోజురోజుకీ ప్రత్యేక హోదా సాధన కోసం ఆయన వేస్తున్న అడుగులు మరింత బలంగా వుంటున్నాయి. ప్రత్యేక హోదా వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ట్వీట్లతోనే ఏపీ యువత ముందుకు కదిలింది. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగింది. ఇంకోవైపు వైకాపా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కూడా తనదైన శైలిలో వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా కోసం పవన్, జగన్ ఏం చేస్తారో చూద్దాం.

వెబ్దునియా పై చదవండి