ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర వైద్య సదుపాయం అవసరమయ్యే పౌరులకు రవాణా కోసం ఓలా క్యాబ్ లకు విశాఖపట్నం నగరంలో పైలట్ ప్రాజెక్ట్ గా అనుమతించడం జరిగిందని రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి (రాష్ట్ర సమన్వయకర్త) ఎమ్. టి.కృష్ణ బాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ కాకుండా డయాలసిస్, క్యాన్సర్, గుండె జబ్బులు తదితర రోగులను ఆసుపత్రులకు తీసుకుని వెళ్ళడానికి, తిరిగి ఇళ్లకు తీసుకుని వెళ్లాడానికి అనుమతించడం జరిగిందన్నారు.
కర్ణాటక రాష్ట్రంలో ఆరోగ్య శాఖ, ప్రభుత్వ సహకారంతో కర్ణాటక రాష్ట్రంలో ఇటువంటి అనుమతులు ఇవ్వడం జరుగుతున్నాయని, తమకు అవకాశం ఇవ్వాలని ఓలా సంస్థ కోరారన్నారు. రవాణా, పోలీసు విభాగాలతో సంప్రదించి పై అభ్యర్థనను పరిశీలించి, ఓలా క్యాబ్ వారి అభ్యర్థన మేరకు ఈ సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నంలో ట్రయల్ ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.
ఈ సౌకర్యం వైద్య అత్యవసర సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాలని తెలిపారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రమాణాలకు లోబడి డ్రైవర్‌ను మినహాయించి ప్రయాణికుల సంఖ్య ఇద్దరు మాత్రమే ఉండాలన్నారు. ఈ ప్రయాణ క్రమంలో వినియోగదారులు మాస్కులు, శానిటైజర్లను ఉపయోగించాలన్నారు.