రాష్ట్ర విభజన అనేది ఓ ముగిసిన అధ్యాయం అని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అందువల్ల ఏపీ పాలకులు, ఇటు తెలంగాణ పాలకులు ఇరు ప్రాంతాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్లీ కోరుకుంటున్నామంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ స్పందించారు.
రెండు రాష్ట్రాలు మళ్లీ కలవడం అనే అంశానికి ఇక భవిష్యత్తులో తావు లేదన్నారు. పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్దతిలో రాష్ట్రాల ఏర్పాటు జరిగిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టులో ఓ కేసు ఉండొచ్చు. ఇంకేవైనా న్యాయపరమైన అంశాలు జరుగుతుండొచ్చు. కానీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలు ఏర్పడి, రెండు ప్రభుత్వాలు ఎన్నికైనపుడు మళ్లీ ఉమ్మడి రాష్ట్రం అంటూ కొత్త పల్లవి అందుకోవడం విచిత్రంగా ఉందన్నారు.