రాష్ట్రపతి ఎన్నిక కోసం సోమవారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో ఉన్న అసెంబ్లీ ప్రాంగణాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే, ఈ ఎన్నికల్లో ఓటును ఎలా వేయాలో కూడా మాక్ పోలింగ్ పేరుతో ప్రజాప్రతినిధులకు రెండుమూడు దఫాలుగా వివరించారు. అయినాసరే మన బుర్రలేని ఎమ్మెల్యేల చెవికెక్కలేదు.
ఈకాలంలో ఏమీ తెలియని నిరక్ష్యరాస్యుడు సైతం ఈవీఎంలలోనే కాకుండా, బ్యాలెట్ పత్రాల ద్వారా కూడా తన ఓటు హక్కును స్పష్టంగా వినియోగించుకుంటున్నాడు. కానీ, ఓటర్లు వేసిన ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు మాత్రం ఓటును ఎలా వినియోగించుకోవాలో తెలియదనే విషయం సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ద్వారా బహిర్గతమైంది.
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార టీడీపీ ఎమ్మెల్యేల విషయానికి వస్తే... బ్యాలెట్ పత్రాలపై తమ పేర్లు రాయడమే కాకుండా, ఏకంగా సంతకాలు కూడా చేశారట. వీరిలో జితేందర్ గౌడ్, కదిరి బాబూరావులు ఉన్నారట. వీరిద్దరూ బ్యాలెట్ పేపరుపై ఒకటో నంబరు వేయడంతో పాటు.. తమ పేరు కూడా రాశారట. ఈ విషయం తెలిసిన చంద్రబాబు ఆ ఇద్దరికి క్లాస్ పీకినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఇపుడు ఈ ఓట్లు చెల్లుతాయో లేదో తెలియాల్సి ఉంది.