జగన్​కు జైలు భయం: లోకేశ్

శనివారం, 15 ఫిబ్రవరి 2020 (13:17 IST)
సీఎం జగన్​కు జైలు భయం పట్టుకుందని, అందుకే తెదేపాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ విమర్శించారు. ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్​లో విమర్శలు గుప్పించారు. అవినీతిపరుడైన జగన్‌కు లోకమంతా అవినీతి కనపడటంలో ఆశ్చర్యం లేదన్నారు.

దేశంలో 40 చోట్ల ఐటీ సోదాలు నిర్వహిస్తే రూ.85 లక్షలు దొరికాయని.. చంద్రబాబు మాజీ పీఎస్ ఇంట్లో రూ.2 వేల కోట్లు దొరికాయని వైకాపా ఎలా చెబుతుందని నిలదీశారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ అదేదో గొప్ప పని అనుకుంటున్నారని మండిపడ్డారు.

జగన్‌కు జైలు భయం పట్టుకుందని.. అందుకే ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టాలని తాపత్రయపడుతున్నారని ధ్వజమెత్తారు. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి తనలాగే అందరూ జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
 
సీబీఐ కౌంటర్​ పిటిషన్​పై మాట్లాడరెందుకు?: అచ్చెన్నాయుడు
రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులను వైకాపా నేతలు తెలుగుదేశానికి ముడిపెడుతున్నారని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఐటీ సోదాలు జరిగాయని తెలిపారు.

ఐటీ దాడుల గురించి మాట్లాడుతున్న వైకాపా నేతలు...జగన్ కేసుల్లో సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్​పై ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులను తెదేపాకు ముడిపెట్టడం వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమని తెదేపా నేత అచ్చెన్నాయుడు ఆరోపించారు.

చంద్రబాబుపై బురద జల్లేందుకే ఈ ఐటీ దాడులను అస్త్రంగా తీసుకున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో తెదేపా కంటే వైకాపానే ఎక్కువ ఖర్చు చేసిందని..ఆ డబ్బులన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

ఐటీ సోదాల్లో రూ.85లక్షలు పట్టుబడితే వేల కోట్లుగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ వేసిన కౌంటర్ పిటిషన్​పై వైకాపా నేతలు ఎందుకు నోరు తెరవడం లేదని నిలదీశారు.

40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు పై ఎటువంటి మచ్చ లేదని..26కు పైగా విచారణలు జరిపించినా ఒక్కటి కూడా రుజువు చేయలేకపోయారని గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు