రియో ఒలింపిక్స్‌లో రజత పతకం నెగ్గిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం శ్రీకాళహస్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పీవీ సింధు రాహుకేతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం ఆమెకు గురు దక్షిణమూర్తి మండపం వద్ద ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందచేశారు.
సింధుతో పాటు బీజేపీ నేత, టీడీపీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి కూడా ఉన్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన తన తల్లిదండ్రులతో కలిసి సింధు తిరుమల శ్రీవారిని దర్శించుకుని శ్రీవెంకటేశ్వరుడికి తులాభారం మొక్కు కింద 68 కిలోల బెల్లంను సమర్పించుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆగష్టు నెలలో లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకుంది.