హైదరాబాద్ తమ రాజధాని కాదని.. తాను అక్కడ ఉండబోనని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు సంచలన నిర్ణయం ప్రకటించారు. అంతేగాకుండా తనకు అక్కడ నివాసం అక్కర్లేదని.. తన అధికారిక నివాసాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుకు 2014లో బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో 27వ నెంబర్ క్వార్టర్‌ను కేటాయించారు.
ఇతర మంత్రులందరూ తమ హైదరాబాద్ నివాసాన్ని వదులుకోని నేపథ్యంలో మాణిక్యాల మాత్రం తనకు హైదరాబాదులో నివాసం వద్దంటూ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. దీంతో వేరేదారి లేకుండా ఆ క్వార్టర్ కేటాయింపును రద్దు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా గుంటూరు, విజయవాడ పరిసరాల్లో ఎక్కడ కావాలన్నా మంత్రికి నివాస వసతి కల్పిస్తామని ఏపీ సర్కారు వెల్లడించింది.
కాగా ఏపీ సచివాలయంతో పాటు ప్రభుత్వ ఆఫీసులన్నీ హైదరాబాదు నుంచి అమరావతికి తరలివచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రుల నివాసాలు కూడా మెల్ల మెల్లగా గుంటూరు, విజయవాడలకు చేరుకున్నాయి. అయితే కొందరు మాత్రం హైదరాబాదు నుంచి ఏపీ ప్రభుత్వ పనులు చేస్తున్నారు. ఈ విధానాన్ని మార్చుకుని ఏపీకి వచ్చేయాలని పైడికొండల తన నివాసాన్ని వద్దనుకోవడం ద్వారా చెప్పకనే చెప్పారు.