కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు గ్రామంలో గత యేడాది ఆగస్టు నెల 25వ తేదీన అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు నెరణికి బోయరామయ్య, వండ్రమ్మ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా.. వారి కుటుంబ సభ్యులను రేణుదేశాయ్ పరామర్శించారు.
ఈ సందర్భంగా రేణూ దేశాయ్ మాట్లాడుతూ, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అన్నదాతల ఉసురు తప్పకుండా తగులుతుందని ఆమె శాపనార్థాలు పెట్టారు. స్థానికుల సమస్యలను ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి తీసుకెళతానని ఆమె హామీ ఇచ్చారు.
కాగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన అటు ప్రభుత్వం, ఇటు విపక్ష పార్టీల వైఖరిని తూర్పూరపడుతున్నారు. ఈ నేపథ్యంలో రేణూ దేశాయ్ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను పరామర్శించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, మరో రెండుమూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆమె ఈ తరహా పర్యటనలకు శ్రీకారం చుట్టడంపై ఇపుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.