కొండపల్లిలోని పుట్లమ్మ గట్టు వద్ద కొండ చరియలు విరిగి పడి ఒక ఇల్లు ధ్వంసం అయింది. ఇద్దరికి గాయాలయ్యాయి. అసలే పని లేక పస్తులు ఉండే పరిస్థితులతో కిట్టుమిట్టాడుతున్న కుంటుంబాన్ని, కొండ రాళ్లు వచ్చి మీద పడి చిద్రం చేశాయి. దీంతో కుటుంబ సభ్యులు ఒకరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుంటే మరొకరు ఇంటి వద్దనే ఉండి వైద్యం చేయించుకుంటున్నారు.
కూలి పనులు చేసుకుని జీవనం సాగించే దేవికి ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు అగ్ని పరీక్ష పెట్టాయి. ఒక పక్క భారీ వర్షాల కారణంగా పనులు లేక పస్తులు ఉండాల్సిన దుస్థితిలో కుటుంబం అవస్థలు పడుతుండగా, అది చాలదు అన్నట్లుగా తెల్లవారుజామున కొండచరియలు విరిగి సుమారు రెండు టన్నుల బరువు ఉన్న పెద్ద సైజు బండరాయి ఇంటికి వెనుక వైపున ఉన్న గోడను నెట్టుకుని ఇంటిలోకి వచ్చి పడింది.
జరిగిన దుర్ఘటతో విస్తుపోయిన దుర్గ హాహాకారాలతో పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి దుర్గ తండ్రిని, కుమార్తె భవానిని శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. అయితే నిద్రలో ఉన్న వారిపై ఇంటి గోడలు, నాపరాళ్లు పడడంతో బలమైన గాయాలయినట్లు తెలుస్తుంది.