విద్యుత్ కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా... ఇదే బాబు అయితే?
మంగళవారం, 10 ఆగస్టు 2021 (13:20 IST)
ఏపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో రూ.2,342 కోట్లు ఆదా చేసిందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని నెడ్క్యాప్ చైర్మన్ కే కే రాజు చెప్పారు. వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కే కే రాజు మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనా పారదర్శకతకు, నిజాయితీకి ఇంత కంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు.
సీఎం వైఎస్ జగన్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో ఖజానాకు వెలుగులు నింపుతుంటే, చంద్రబాబు హయాంలో ఆయన కాంట్రాక్టర్లకు దోచిపెట్టడమే సరిపోయిందన్నారు. 2014 -19 మధ్య చంద్రబాబు విద్యుత్ వ్యవస్థను అంధకారం చేశారని, విద్యుత్ వ్యవస్థలో బాబు చేసిన పాపాల చిట్టా విప్పారు. చంద్రబాబు కుదుర్చుకున్న పిపిఏ ల పాపం 60 వేల కోట్లన్నారు. అవసరం లేకున్నా విద్యుత్ కొనడం, అది కూడా ఇతర రాష్ట్రాల కన్నాఎక్కువ చెల్లిస్తూ, ఒప్పందాలు చేసుకోవడం ఆయన నైజం అని కేకే రావు చెప్పారు.
చంద్రబాబు సీఎం కాకముందు అంటే 2014 కు ముందు, పవన విద్యుత్ యూనిట్‌కు రూ.3.74 చెల్లిస్తే, 2015 నుంచి యూనిట్‌కు రూ.4.84 చొప్పున చెల్లించారని, 5 ఏళ్లపాటు చెల్లించేలా 42 పిపిఏ లు చేసుకున్నారని, ఇంతకంటే దుర్మార్గం, ప్రజల సొమ్ము దోపిడీ ఉంటుందా? అని ప్రశ్నించారు. ఈ పీపీఏల వల్ల డిస్కమ్‌లు ప్రైవేటు సంస్థలకు రూ.39,280 కోట్లు చెల్లించాలని, ఈ డబ్బులు చంద్రబాబు తన జేబులోంచి ఇవ్వరు కదా? ఇదంతా ప్రజల సొమ్మే కదా అని వివరించారు.
తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో పవన్ విద్యుత్ యూనిట్ రూ.3.46 ఉందని తెలిపారు. 2016 లో సోలార్ పీపీఏలు దాదాపు 1,500 మెగావాట్ల మేర జరిగాయని, అప్పుడు కూడా గరిష్టంగా యూనిట్ ధర రూ.6.80 పెట్టారని తెలిపారు. అదే సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం యూనిట్ రూ.4.66 ధరతో నెడ్‌క్యాప్, జెన్‌కో, ఎన్టీపీసీ, సెకీతో ఒప్పందాలు చేసుకుందని పేర్కొన్నారు. 2015–19 మధ్య 2,308 మెగావాట్ల మేర 36 సోలార్ పీపీఏలు జరిగాయని, వీటి విలువ రూ.22,868 కోట్లు అని వివరించారు.
ఆ తర్వాత కాలంలో అన్ని రాష్ట్రాల్లో యూనిట్ ధర రూ.2కు పడిపోయినా, మన రాష్ట్రంలో మాత్రం రూ.4.50కే పీపీఏలు చేసుకోవడాన్ని బట్టి చంద్రబాబు ఎంత నొక్కేసారో సామాన్యులు కూడా ఈజీగా అర్ధం చేసుకోవచ్చని కేకేరావు చెప్పారు. చంద్రబాబు నాయుడికి , ఆయన ఆనుకూల మీడియాకు ఏ విషయంలోనూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు. దోపిడీకి మారుపేరు చంద్రబాబు అని పేర్కొన్నారు.