ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక ప్రాంతాల్లో అధికార విపక్ష పార్టీల నేతల వ్యూహాలు పన్నుతున్నారు. ఇందుకోసం అనేక గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సర్పంచ్, వార్డు మెంబరు పోస్టులను వేలం వేస్తున్నారు. ఈ క్రమంలో కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్న 240 మంది ఓటర్లు.. ఒక్కో ఓటరు రూ.8 వేలకు చొప్పున అమ్ముడు పోయారు. ఈ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీపడిన అభ్యర్థి ఏకంగా 20 లక్షల రూపాయలను ఆఫర్ చేశారు. అయితే, ఈ మొత్తాన్ని గ్రామానికి ఇవ్వనని, ఒక్కో ఓటరుకు పంచుతానని చెప్పడంతో వారు సమ్మతించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అభ్యర్థుల ప్రలోభాలు కూడా ఎక్కువైపోయాయి. గ్రామాభివృద్ధికి డబ్బులు ఇస్తానని అభ్యర్థులు ముందుకు రావడంతో చాలా గ్రామాల్లో సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవుతోంది.
తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు ఇస్తానని, అయితే, ఈ సొమ్మును గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయకుండా, ఒక్కో ఓటరుకు రూ.8 వేల చొప్పున పంచుతానని హామీ ఇచ్చాడు. దీని గ్రామస్థులు సమ్మతించడంతో ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. దీంతో పోటీ చేయాలని భావిస్తున్న ఇతర అభ్యర్థులను బరిలోంచి తప్పించేందుకు గ్రామ పెద్దలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.