గత వైకాపా ప్రభుత్వంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన కారు డ్రైవర్‌ను హత్య చేసి మృృతదేహాన్ని కారులో తీసుకెళ్లి ఇంటికి డోర్ డెలివరీ చేసిన కేసును మళ్లీ విచారించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణకు అనుమతిస్తూ, 90 రోజుల్లో అనుబంధ (సప్లిమెంటరీ) అభియోగపత్రం దాఖలు చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సింగవరపు ఉమా సునంద మంగళవారం ఆదేశాలిచ్చారు.
వైకాపా ప్రభుత్వ హయాంలో అప్పటి పోలీసు అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయకుండా కేవలం ఎమ్మెల్సీ అనంతబాబునే నిందితుడిగా చేర్చారని.. ఇందులో మరింతమంది పాత్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో విన్నవించారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
దంతో రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతోపాటు, ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న విచారించిన న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. దీంతో ఈ కేసు మళ్లీ మొదటి నుంచి విచారణ జరుగనుంది.