సచివాలయ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వర్తించాలి : మంత్రి పేర్ని నాని
గురువారం, 10 డిశెంబరు 2020 (07:13 IST)
ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అత్యంత ప్రాముఖ్యత ఇస్తుందని, ప్రజలకు అన్ని రకాల సేవలను గ్రామ, వార్డు స్థాయిలోనే పొందే సౌలభ్యాన్ని కలిగించడం జరిగిందని, కనుక సచివాలయ ఉద్యోగులు తమ తమ విధులను అంకిత భావంతో నిర్వర్తించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని సూచించారు.
తన మచిలీపట్నం కార్యాలయంకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను కలిసి వారి ఇబ్బందులను ఆయన అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, అత్యధిక శాతం మంది ప్రజలు రేషన్ కార్డులు జారీ కావడం లేదని, వివిధ రకాల పింఛన్లు మంజూరవడం లేదని తమ వద్దకు వస్తున్నట్లు తాను గమనించినట్లు తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాలలో ఉద్యోగులు తమ వద్దకు వచ్చిన రేషన్ కార్డులు, పింఛన్లలలో, విద్యుత్ బిల్లులతో తలెత్తిన అభ్యంతరాలను సరిచేయడానికి అడ్మిన్లకు, వెల్ఫేర్ సెక్రటరీలు, సెక్రటరీలకు ప్రభుత్వం ఇప్పుడు తాజాగా 'సిక్స్ స్టెప్స్ క్లారిటేషన్' ప్రక్రియ కింద మరో చక్కని అవకాశం ఇచ్చిందని, దీనిని బాధ్యత తీసుకోని సాంకేతికంగా తప్పులు చూపించి, గతం నుంచి పెండింగ్ లో నిలిచిపోయిన వివిధ రకాల కార్డులను సరి చేయాలన్నారు.
ప్రజలకు సేవ చేయడానికి ఇదో చక్కని అవకాశమని మంత్రి సచివాలయ ఉద్యోగులకు ఆదేశించారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేయని ప్రజల ముంగిటనే గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్థాపించడం చారిత్రాత్మక ఘట్టమని అన్నారు.
గ్రామంలో 50 నుంచి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ ను నియమించి, వేకువ ఝామునే, సూర్య కిరణాలు పింఛనుదారుల ఇంటి తలుపులను తాకకముందే, పింఛన్లు వారి గడప వద్దనే అందజేసే బృహత్తర లక్ష్యాన్ని సాధించడంలో మన ప్రభుత్వం సరికొత్త చరిత్రను సృష్టించిందన్నారు. ప్రజలతో మమేకమై, మృదు మధుర భాషణతో ప్రజలకు సత్వరమే సేవలందించాలని అన్నారు.
తమ విధులు, బాధ్యతలను సచివాలయ ఉద్యోగులు పూర్తిగా తెలుసు కోవాలన్నారు. ప్రజలకు సకాలంలో సక్రమంగా సేవలను అందించాలని తెలిపారు. ప్రవర్తనా నియమావళిని తప్పని సరిగా పాటించాలని, గ్రామ, వార్డు సచివాలయాలలో అవినీతికి పాల్పడిన సచివాలయాల సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొనడం జరుగుతుందని మంత్రి పేర్ని నాని చెప్పారు.