అమరావతి: తెలుగు వైభవాన్ని ప్రతిబింబించే శిల్పారామాలు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. గతంలో హైదరాబాదులో మాత్రమే ఉన్నశిల్పారామంను విభజన తర్వాత ఇక్కడ అన్ని జిల్లాలలో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించారన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడిగిన ప్రశ్నకు మంత్రి అఖిల ప్రియ సమాధానం ఇస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాకో శిల్పారామం ఏర్పాటు తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.
ఇందులో కళలు, తెలుగు జాతి సంస్కృతి వైభవాన్ని పునరుజ్జీవంప చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. శిల్పారామంలో బొమ్మలు, బుట్టలు, బట్టల నేత కళారూపాలు తయారు చేసేవారు దళారులు లేకుండానే నేరుగా వారి ఉత్పత్తులు అమ్ముకునేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే విశాఖ, కడప, తిరుపతి, పులివెందల, పుట్టపర్తిలలో శిల్పారామాలు ఉన్నాయని, వాటి పునరుద్ధరణకు 5 కోట్ల రూపాయలు వినియోగిస్తున్నామన్నారు. ఇక కొత్తగా విజయనగరంలో రూ.1.93 కోట్లతో, గుంటూరులో కోటిన్నరతో పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని అఖిల ప్రియ తెలిపారు.
కాకినాడలో శిల్పారామం 2.30 కోట్లతో ఆగస్టులో పూర్తవుతుందని చెప్పారు. కర్నూలులో శిల్పారామం నిర్మాణానికి పరిపాలనా అనుమతులు వచ్చాయని, స్థల సేకరణ చేయాల్సి ఉందన్నారు. అలాగే, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాలో స్థల కేటాయింపులు పూర్తయ్యాయని, ఇక నిర్మాణాలు చేయాల్సి ఉందన్నారు.
అమరావతిలో 50 ఎకరాల్లో మెగా శిల్పారామం
ఆంధ్రప్రదేశ్ సరికొత్త రాజధాని అమరావతిలో మెగా శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి భూమా అఖిల ప్రియ శాసన సభలో వివరించారు. దీనికి 50 ఎకరాలు కావాలని ప్రతిపాదనలు ఉన్నాయని, దీనిని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆసక్తితో ఉన్నారన్నారు.
స్థలం కేటాయించాలని సిఆర్డిఎ కమిషనర్‌కు ఆదేశాలిచ్చారని, ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారైందన్నారు. ఇందులో ట్రయినింగ్ సెంటర్, కళాకారులకు డార్మెటరీలు, హాస్టళ్ళు ఒక యాంపీ థియోటర్, పుడ్ కోర్టు వంటివి ఉంటాయన్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి అఖిల ప్రియ తెలిపారు. మెగా శిల్పారామంలో శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ ఇనిస్ట్ట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్. ఎన్.ఐ.టిలతో ఒప్పందాలు కూడా చేసుకుంటామని చెప్పారు.