కాంగ్రెస్ పార్టీకి, తెరాసకి షాకిచ్చే న్యూస్. మాజీ మంత్రి జానారెడ్డి కమలం తీర్థం పుచ్చుకోనున్నారనే వార్త. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయంతో మంచి ఊపుమీద వున్న భాజపా అదే ఉత్సాహంతో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోనూ తిష్టం వేయాలని వ్యూహం రచిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలోని నాయకులు చాలామంది నైరాశ్యంతో వున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీమంత్రి జానారెడ్డిని కాంగ్రెస్ పార్టీతో లాభం లేదని ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు భోగట్టా. జానాకు నియోజకవర్గంలో మంచి పట్టు వుంది. గత ఎన్నికల్లో ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి బరిలోకి దిగుతారన్న ప్రచారం జరిగింది. కానీ జానారెడ్డి పోటీ చేసి నోముల నర్శింహయ్య చేతిలో పరాజయం చవిచూసారు. ఇప్పుడు జానారెడ్డి కుమారుడితో భాజపా మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో జానాకి కూడా ప్రత్యామ్నాయం భాజపా తప్ప మరో పార్టీ లేదు.